హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్‌లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్‌దేవ్‌నగర్‌లో ఉంటున్నాడు.
కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


