సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌పై ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువతితో అరుణ్‌కుమార్‌కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్‌కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
అక్కడ వాచ్‌మెన్‌తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్‌కుమార్‌కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!


