ఉద్యోగం అంటే కేవలం జీతం సంపాదించే మార్గం మాత్రమే కాదు.. జీవితంలో ఎంత స్వేచ్ఛ, సంతృప్తి ఉందన్న దానికీ అది కీలకంగా మారుతుంది. చాలా మంది మంచి వేతనం పొందుతున్నా, తమ సమయంపై నియంత్రణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పని పట్ల ఆసక్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోసం అన్వేషణ పెరుగుతోంది. అసలు ఒక ఉద్యోగం మనకు సరిపోతుందా లేదా అన్నది ఎలా అంచనా వేయాలి? ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దామా?
మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది చాలా మంది మనసులో మెదిలే ఒకే ఒక్క కల గురించే..! అదేంటంటే, మీ ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని ఆప్షనల్ (Optional)గా చేసుకోవడం..! అంటే, మీకు నచ్చితే.. ఆ ఉద్యోగంలో కొనసాగవచ్చు. లేదంటే ఎప్పుడైనా రిజైన్ చేసి బయటికి వచ్చేయవచ్చు. అయితే.. అసలు ఆ ఉద్యోగం లేకపోయినా బిల్లులు కట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదనే ధైర్యం ఉండాలి..! అదే ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్వేచ్ఛ..!
మరి ఖర్చుల సంగతేంటి?
ఇప్పుడే చాలా మందిని ఓ ప్రశ్న తొలిచివేస్తుంది. ‘‘మరి నా ఉద్యోగం ఇంకా ఎందుకు ఆప్షనల్ కాలేదు?’’ అని. దానికి ప్రధాన కారణం మన ఖర్చులే.. ! మనకు రెంట్ కావాలి. ఫుడ్ కావాలి. బిల్లులు కట్టాలి. ఉదాహరణకు, నెలవారీ ఖర్చులు ఒక లక్ష రూపాయలు అనుకుందాం. ఈ ఖర్చులను తీర్చడానికే మనం రోజూ ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్తుంటాం. మరి దీన్ని ఎలా మార్చాలి..? ఖర్చులను జీరో చేయడం అంటే ఒక సన్యాసిలా అడవికి వెళ్లిపోవాలి. కానీ, ఈ సంసార బంధంలో అది సాధ్యం కాదు..! అలాగని ప్రభుత్వాలు వచ్చి మనకు ఉచితంగా డబ్బులిచ్చేస్తాయి అంటే అది కూడా ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. మరి ఏం చేయాలి..?
ఇక్కడ అసలు సమస్య ఉద్యోగం చేయడం కాదు. ఆ ఉద్యోగంలో మీకు కావాల్సినంత స్వేచ్ఛ (Freedom) లేకపోవడమే అసలు సమస్య..! ప్రతి ఉద్యోగాన్ని లేదా పనిని మనం నాలుగు అంశాల ఆధారంగా బేరీజు వేసుకోవచ్చు. అవే 'ది 4 ఎఫ్స్' (The 4 Fs): అవేంటంటే..
ఫన్ (Fun): ఆ పని చేస్తున్నప్పుడు మీకు ఆనందం ఉందా?
ఫ్లెక్సిబిలిటీ (Flexibility): టైమ్ విషయంలో మీకు స్వేచ్ఛ ఉందా?
ఫుల్‌ఫిల్మెంట్ (Fulfillment): ఆ పని చేయడం వల్ల మీకు ఆత్మతృప్తి కలుగుతోందా?
ఫైనాన్సెస్ (Finances): మీకు తగినంత డబ్బు వస్తోందా?
మీ జాబ్‌లో ఈ నాలుగింటిలో బ్యాలెన్స్ మిస్సయినప్పుడే మీకు ఆ ఉద్యోగంపై విసుగు వస్తుంది. ఇక్కడ డబ్బు 10/10 ఉండి, ఫ్లెక్సిబిలిటీ 1/10 కూడా లేకపోతే అది బ్యాడ్ ఫ్రీడమ్ ప్రొఫైల్ అవుతుంది. అందుకే ఏ ప్రొఫెషన్‌లోనైనా చాలా మంది మేధావులు ఉద్యోగంతోపాటు.. చిన్నచిన్న బిజినెస్‌లు లేదా తమ ప్రొఫెషన్‌లోనే ఫ్రీలాన్సింగ్ వైపు అడుగులేస్తుంటారు. నిజమే.. అలాంటివారికి చేసే పనిపై కాస్త ఎక్కువ నియంత్రణ (Control) దొరుకుతుంది.
ఇప్పుడు అసలైన లాజిక్‌కి వద్దాం. మనం లైఫ్‌లో శాశ్వతంగా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే కేవలం 'ఇన్‌కమ్' మీదనే ఆధారపడితే సరిపోదు. అసెట్స్ (Assets) కావాలి..! అసెట్స్ అంటే ఏమిటి..? మీ ప్రమేయం లేకుండా మీ జేబులోకి డబ్బులు తెచ్చిపెట్టేవే అసెట్స్..!
ఉదాహరణకు..
మీరు ఒక ఇల్లు కొని అద్దెకిస్తే వచ్చే రెంటల్ యీల్డ్.
స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్స్.
లేదా మీరు ఒక మంచి పుస్తకం రాస్తే.. అది ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్‌గా అమ్ముడవుతుంటే వచ్చే రాయల్టీ చెక్కులు..!
మీరు పని చేయడం ద్వారా సంపాదిస్తారు. దాన్ని Income అంటాం. ఆ వచ్చిన లాభంతో అసెట్స్ కొంటారు. కాలక్రమేణా ఆ అసెట్స్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు మీరు పని చేయకపోయినా సరే.. మీ ఖర్చులు ఆటోమేటిక్‌గా ఆ అసెట్స్ ద్వారా తీరిపోతాయి. ఆ రోజుకి మీ పని పూర్తిగా ఆప్షనల్ అయిపోతుంది..!
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పని చేయడం మానేయడమే రిటైర్మెంట్ కాదు..! నిజానికి పూర్తిగా పనిచేయడం మానేస్తే డిప్రెషన్, ఆరోగ్య సమస్యలు వస్తాయని సైన్స్ చెబుతోంది. మనుషులకు ఎప్పుడూ ఏదో ఒక ఉద్దేశం అంటే.. Purpose కావాలి. నిజమైన రిటైర్మెంట్ అంటే.. 'డబ్బుతో సంబంధం లేకపోయినా, మీరు ఏ పనైతే ఇష్టపడి చేస్తారో.. అదే పనిని రోజూ చేయడం!'
ఉదాహరణకు..
ప్రపంచ ప్రఖ్యాత రచయిత బ్రాండన్ సాండర్సన్ కోటీశ్వరుడైనా సరే, రోజూ గంటల తరబడి రాస్తూనే ఉంటారు. ఎందుకంటే అతనికి రాయడమంటే ప్రాణం. డబ్బు కోసం కాదు కేవలం ఆనందం కోసం రాస్తారు.
మీరు కూడా మీ జీవితంలో రెండు జాబితాలు తయారు చేయండి:
డబ్బు కోసం మాత్రమే నేను చేస్తున్న పనులేంటి..? అనేది మొదటి జాబితా. ఇందులో ఆఫీస్ మీటింగ్స్, బ్యూరోక్రసీ మొదలైనవి ఉంటాయి.
రెండో జాబితాలో.. డబ్బు ఇవ్వకపోయినా నేను సంతోషంగా చేయగల పనులేంటి..? అనేదాన్ని రాసుకోవాలి. జాబ్‌ను ఆప్షనల్‌గా మార్చుకోవాలంటే.. మీ లక్ష్యం ఒక్కటే కావాలి: రెండో కేటగిరీలోని పనిని పెంచుకుంటూ పోవడం. మొదటి కేటగిరీలోని పనిని తగ్గించుకోవడం..!
అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో చిన్నదైనా సరే సొంతంగా ఒక వ్యాపారం లేదా క్రియేటివ్ జర్నీని ప్రారంభించి.. అందులో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించే కాదు.. మీ జీవితంపై పూర్తి నియంత్రణను తెచ్చిపెడుతుంది. మీరు ఉద్యోగం చేస్తూనే, నెమ్మదిగా అసెట్స్‌ను బిల్డ్ చేసుకోండి. మీ ఫ్రీడమ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుచుకోండి. అప్పుడు ఒక రోజు మీ ఉద్యోగం మీకు ఆప్షనల్ అవుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని జీవించవచ్చు.
-సాక్షి వెబ్‌డెస్క్


