దివ్యాంగుడి కస్టోడియల్‌ డెత్‌! విజయ్‌ సర్కార్‌ మౌనంపై ఆగ్రహం | Tamil Nadu Custodial Death Row, Opposition Seeks CM Vijay's Response Over Disabled Man's Death | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడి కస్టోడియల్‌ డెత్‌! విజయ్‌ సర్కార్‌ మౌనంపై ఆగ్రహం

Jul 15 2026 9:32 AM | Updated on Jul 15 2026 10:23 AM

Nagercoil Custodial Death Puts Vijay Government Under Pressure

తమిళనాడును మరో లాకప్‌డెత్‌ మరణం కుదిపేస్తోంది. దివ్యాంగుడైన శబరివర్మన్‌ పోలీసుల కస్టడీలో ఉండగా మృతి చెందడం వివాదాస్పదమైంది. అతని ఒంటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులు హింసించి చంపారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విజయ్‌ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్‌ దివ్యాంగుడు. గుట్కా, పాన్‌ మసాలా అక్రమ విక్రయాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించింది. అయితే సోమవారం తెల్లవారుజామున జైల్లో శబరివర్మన్‌ మృతి చెందాడు.

మృతదేహంపై గాయాలు.. జైల్లో ఏం జరిగింది?
శబరివర్మన్‌ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మొత్తం 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జైల్లో అతడిపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అనంతరం సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

డీఎంకే ఆగ్రహం.. సీఎం విజయ్‌కు ప్రశ్నలు
శబరివర్మన్‌ మృతి రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లిన తర్వాత గాయాలతో ఎలా మృతి చెందాడని ప్రశ్నించారు. దివ్యాంగుడన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాడి చేశారన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.

అంతేకాదు.. ఇటీవల గుట్కా కేసులో ఓ టీవీకే నేత అరెస్టై అదే రోజు బెయిల్‌ పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సామాన్యులకు ఒక చట్టం, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా? అంటూ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. గతంలో లాకప్‌డెత్‌ల సమయంలో విజయ్‌ వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు అధికారంలో మౌనం వహించడం సరికాదని అంటున్నారు.

తమిళనాడులో కస్టడీ మరణాలపై మళ్లీ చర్చ
శబరివర్మన్‌ ఘటనతో తమిళనాడులో కస్టడీ మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. 2020లో తూత్తుకుడిలో జరిగిన జయరాజ్‌, బెన్నిక్స్‌ తండ్రీకొడుకుల కస్టడీ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే శివగంగైలో అజిత్‌ కుమార్‌, తిరుప్పూర్‌లో మారిముత్తు కస్టడీ మరణాల ఘటనలు కూడా తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఇప్పుడు నాగర్‌కోయిల్‌ ఘటనలో దివ్యాంగుడి మృతి, మృతదేహంపై గాయాల అంశం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే శబరివర్మన్‌ మృతికి దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement