బుట్టాయగూడెం: సంత మార్కెట్ సమీపంలో ఉన్న టీ స్టాల్‌లో మంగళవారం అర్థరాత్రి ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు గొడవపడ్డారు. దీంతో సైదు అనే వ్యక్తి స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన నవీన్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. సంఘటన వివరాలు తెలిసిన ఎస్సై చెన్నారావు నవీన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బుధవారం ఘర్షణ, దాడి జరిగిన ప్రదేశాన్ని ఎస్సై తన సిబ్బందితో సందర్శించి సంఘటన వివరాలను సేకరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దివ్యాంగుల సాధికారత రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ‘జాతీయ అవార్డులు–2026’ నామినేషన్లుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్‌వెల్ సీఈఓ కే. ప్రభాకర రావు తెలిపారు. అర్హులైన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు.


