జంగారెడ్డిగూడెం: ఎర్రకాలువ జలాశయం ఎడమ, కుడి కాలువల మరమ్మతు పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయా ప్రాంతాల రైతులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు (ఎస్టిమేషన్లు) మార్చేసి, ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు నిరసనగా ఇటీవల రైతులు జలాశయ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు.
నచ్చిన వారికి పనులు కట్టబెట్టి.. ఎడమ, కుడి ప్రధాన కాలువల మరమ్మతుల కోసం రూ.1.40 కోట్లతో సుమారు 14 పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, నిబంధనల ప్రకారం ఎక్కువ ఖర్చయ్యే పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ అధికారులు టెండర్లు పిలవకుండా తప్పించుకోవడానికి వీలుగా, ప్రతి పనిని రూ.10 లక్షల లోపే అంచనా వేసి నామినేషన్ పద్ధతిపై తమకు నచ్చిన వారికి పంపకాలు జరిపారు. ఈ 14 పనుల్లో ఒక్కో పనిని లక్ష రూపాయల చొప్పున అమ్ముకోవడమే కాకుండా, అధికారులకు అదనంగా పర్సంటేజీల రూపంలో వసూళ్ల దందా సాగిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇక జలాశయ కార్యాలయంలో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, ఒక నీటి సంఘం పేరుతో ఏకంగా నాలుగు పనులను దక్కించుకున్నాడని, ఆ నాలుగు పనుల వాటాలను సదరు ఉద్యోగి, ఇరిగేషన్ అధికారులు కలిసి పంచుకోగా, మిగిలిన పనులను ఇతర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు.
తూతుమంత్రంగా కాలువ పనులు
కాలువల్లో పనులు అత్యంత నాసిరకంగా, తూతూ మంత్రంగా సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో 9ఆర్ వద్ద పూడిక తీయకుండానే అలాగే వదిలేశారని, ఎడమ కాలువపై ఉన్న రాళ్ల కాలువ వద్ద డ్రాప్ నిర్మాణం అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే 17వ తూము వద్ద వెంకటరామానుజపురం, పంగిడిగూడెం వెళ్లే కాలువలకు పూడికతీత పనులు సరిగా చేయలేదని, గేట్లకు కనీస మరమ్మతులు చేయకుండానే మమ అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో మట్టి తీయకుండా కేవలం గడ్డిని మాత్రమే తొలగించి బిల్లులు చేసుకుంటున్నారని వాపోయారు. మరోవైపు ప్రాజెక్టు గేట్ల బేరింగ్‌లు, మరమ్మతు పనుల పేరుతో కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే రెండుసార్లు అంచనాలు వేసి నిధులు స్వాహా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల చేసిన పనుల్లో గేట్ల బేరింగ్‌లకు కేవలం గ్రీజు పూసి, కొన్ని నాసిరకం బేరింగ్‌లను అమర్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల రేపు వరదల సమయంలో గేట్లు మొరాయిస్తే ప్రాజెక్టుకే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో ఉండని అధికారులు
ఇక ఇరిగేషన్ అధికారులు రైతులకు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదని, జంగారెడ్డిగూడెంకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటూ వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కార్యాలయానికి వస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికారులు అలా వచ్చినప్పుడు కూడా రైతు సమస్యలను పట్టించుకోకుండా, మట్టి మాఫియా నుంచి మామూళ్లు వసూలు చేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం పనుల్లో జరిగిన ఈ నాసిరకం పనులు, నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు స్పందించి, విజిలెన్స్ విచారణ జరపాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి, ఎడమ
కాలువల అభివృద్ధి పనుల్లో అవినీతి
నాసిరకంగా పనులు చేస్తూ నిధులు స్వాహా
అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్న వ్యవహారం
విజిలెన్స్ విచారణ చేయాలని రైతుల డిమాండ్


