కట్నం కోసం వేధిస్తున్నట్టు ఆరోపణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కై కలూరులో రాజ్యాంగేతర శక్తిగా మారిన జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్య వరప్రసాద్ (బాబీ) నిజస్వరూపాన్ని అతని భార్య దుర్గాదేవీ మీడియా ముందు మంగళవారం బట్టబయలు చేసింది. ఇటీవల కై కలూరు దానిగూడెం దళితుల దాడి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చిన కొల్లి బాబీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న ఇతనిపై మట్టిదందా, పేకాట నిర్వాహణ వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. కై కలూరు టౌన్ స్టేషన్‌లో బాబీపై అతని భార్య వరకట్న వేధింపులు, అక్రమ సంబంధం, పిల్లలను కలవనివ్వడం లేదంటూ వంటి వాటిపై తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. కొల్లి బాబీకి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన దుర్గాదేవీతో వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. మరింత కట్నం కోసం వేధిస్తుంటే అదనంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. కొల్లి బాబీ వ్యసనాలకు బానిసై తనను మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది. తన పుస్తెలు, పదో తరగతి సర్టిఫికెటపై లోను తీసుకుని కార్లలో తిరుగుతూ తనను మనిషిగా చూసేవాడు కాదని వాపోయింది. తనను 5 సంవత్సరాలుగా దూరం పెట్టి ఇంటికి పంపారన్నారు. తన బిడ్డలను సెలవులకు తీసుకొచ్చి ఏలూరు సిద్దార్థ హాస్టల్‌లో పెట్టారని వారిని చూడనివ్వకుండా చేస్తున్నారని వాపోయింది. తన భర్తతో ప్రాణభయం ఉందని, అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. ఇంటికి వస్తే నరికేస్తా అంటూ బెదిరిస్తున్నాడని, తన భర్తతో పాటు, నా బిడ్డలతో కలసి జీవించే విధంగా న్యాయం చేయాలని కోరింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. దుర్గాదేవి ఫిర్యాదుపై టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణను వివరణగా కోరగా ఫిర్యాదు అందిందని, ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.


