వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
ఆశలన్నీ జగన్ పైనే
డాలర్ల పంటగా పేరుగాంచిన రొయ్యల సాగు చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సిండికేట్ దోపిడీతో సాగు భారమై ఆక్వా చరిత్రలో తొలిసారి రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయం కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఉరితాళ్లు, క్రాప్ హాలిడే హెచ్చరికలతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ తరుణంలో తమ గోడు వినేందుకు, తమ పక్షాన పోరాడేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆక్వా రైతులు గంపెడాశతో ఉన్నారు.
సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లాలో ఆక్వాకు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. అమెరికా, చైనా, యూరప్ దేశాలకు రొయ్యల ఎగుమతులతో ఏటా ప్రభుత్వానికి డాలర్ల రూపంలో కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఆక్వా రైతులకు రూ.1.50కే రాయితీ విద్యుత్‌ను అందించారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్‌మెంట్ అథారటీ(అప్సడా)ని ఏర్పాటుచేసి సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలను రైతులకు జవాబుదారీ చేశారు. మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు కృషిచేశారు.
కూటమి పాలనలో అధోగతి
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి. ప్రస్తుతం అప్సడాకు చైర్మన్‌గా సీఎం చంద్రబాబు ఉన్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్ దాదాపు టీడీపీకి చెందిన వారే కావడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. అదను చూసి ఏకపక్షంగా మేత ధరలు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
రోడ్డున పడుతున్న రైతులు
ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసింది మునుపెన్నడూ లేదని రైతులు అంటున్నారు. సిండికేటు దోపిడీని అడ్డుకోవడంలో చంద్రబాబు తీరుకు నిరసనగా పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, ఉండి, కై కలూరు తదితర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు చెరువులను వీడి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో నరసాపురం, పాలకొల్లు, ఆచంటలో చెరువులను ఎండగట్టి పంట విరామానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పేరిట కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. రెండు నెలల క్రితం మేత ధరలు పెంచడంపై భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర చోట్ల మేత బస్తాలను తగలబెట్టి ఆందోళనలు చేశారు. రొయ్య ధరలను తగ్గించడంపై మేలో పాలకొల్లులో రొయ్యలను రోడ్డుపై వేసి తమకు చావే శరణ్యమంటూ ఉరితాళ్లతో నిరసన తెలిపారు. లోకల్ సేల్స్ పెంచుకునేందుకు మృగశిర కార్తె ప్రారంభం రోజున రొయ్యలు, చేపల కూరలతో ఆచంట, పాల కొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగుచేయలేమంటూ కొందరు రైతులు స్వచ్ఛంద క్రాప్ హాలీడేను పాటిస్తున్నారు.
కూటమి పాలనలో చీకటి రోజులు
సిండికేట్ దోపిడీతో నష్టాల్లో డాలర్ల పంట
సాగు భారమై సాయం కోసం రోడ్డెక్కుతున్న రైతులు
ధర్నాలు, రాస్తారోకోలు, ఉరితాళ్లతో నిరసనలు
చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు
ఆశలన్నీ జననేత జగన్‌పైనే
ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి భీమవరం వస్తున్న జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కోరారు. ఉండి బైపాస్ రోడ్డులోని సభా వేదిక వద్ద మంగళవారం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, భీమవరం కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పార్టీ నేతలు పెండ్ర వీరన్న, పాతపాటి శ్రీనివాసరాజు, మేడిద జాన్సన్, బంధన పూర్ణచంద్రరావు, పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు.
సిండికేట్ దోపిడీని అరికట్టాలని రెండేళ్లుగా రైతులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో జగన్ ఆక్వా రైతులకు అండగా బుధవారం భీమవరం రానుండటం వారికి కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇప్పటికై నా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జననేత రాకకోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.


