ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ యూ.శోభ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తించగా.. తాజాగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీ సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్‌ఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18 వరకు వెబ్ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని దూబచర్ల డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.కమల కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు సీట్లు కేటాయిస్తారన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు సంబంధిత కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యా శాఖకు సంబంధించి జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాఽధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా అకడమిక్ క్యాలెండర్, ఏఐ వినియోగం, లీప్ యాప్‌ను ఉపయోగించడం, విలువల విద్య, క్యూఆర్ కోడ్‌ల వినియోగం, దీక్ష యాప్ వినియోగం, లెర్నింగ్ అవుట్‌కమ్స్ తదితర అంశాలపై రాష్ట్ర స్థాయి రీసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంపికై న 188 మంది రీసోర్స్ పర్సన్లకు 18 మంది రాష్ట్ర స్థాయి రీసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.
భీమవరం: బోధనలో బహుళ నైపుణ్యాలను వినియోగించి విద్యార్థులను ఆకట్టుకుని వారిలో అభ్యసనా ఫలితాలను సాధించాలని జిల్లా విద్యా శాఖాధికారి ఇ.నారాయణ అన్నారు. భీమవరం ఏఆర్‌కెఆర్ మున్సిపల్ హైస్కూల్లో డీఆర్పీల రెండు రోజుల వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఆర్పీలు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకొని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు చక్కని శిక్షణ ఇవ్వాలన్నారు.


