ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో పిలుపు మేరకు మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారికి అందజేశారు. ఏలూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ జీ. మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కో–చైర్మన్ కే నరహరి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని కోరారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, అప్పటివరకు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు, బోధనేతర పనుల నుంచి విముక్తి, కారుణ్య నియామకాల పూర్తి, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై ప్రభుత్వం స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


