ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం అదనపు చార్జీల భారం
ఏపీఈఆర్సీ ఆమోదించిన ధరకంటే అధిక రేట్లకు కొనుగోళ్లు
విద్యుత్ కొనుగోలు ప్రణాళికలో లోపాలు, డిమాండ్ అంచనాల్లో పొరపాట్లు
వినియోగదారుల నుంచి భారీగా ముందస్తు వసూళ్లు
దానిలో వెనక్కి ఇమ్మని ఏపీఈఆర్‌సీ ఆదేశిస్తే తమ గొప్పగా ప్రచారం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులు తగ్గించామని, ట్రూడౌన్ చేసి ప్రజలకు విద్యుత్ బిల్లులు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇచ్చిన తాజా ట్రూ అప్ నివేదికలో అసలు నిజాలు బయటపడ్డాయి. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ) పేరిట ప్రజలపై మోపుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఏపీఈఆర్‌సీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒక ప్రాథమిక విద్యుత్ కొనుగోలు ధర (బీపీపీసీ)ను నిర్ణయిస్తుంది.
అయితే.. డిస్కంలు మార్కెట్‌లో, విద్యుత్ ఎక్స్చేంజ్‌లలో లేదా స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ ధర (ఏపీపీసీ) ఆమోదించిన ధర కంటే ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ఎఫ్‌పీపీసీఏగా వినియోగదారులపై మోపుతారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నెలవారీ ఎఫ్‌పీపీసీఏ గణాంకాలను ఏపీఈఆర్‌సీ ఆమోదించిన బీపీపీసీ కంటే, డిస్కంలు వాస్తవంగా చెల్లించిన ఏపీపీసీ చాలా నెలల్లో అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యత్యాసంతో ఏర్పడిన అదనపు భారాన్ని ఎఫ్‌పీపీసీఏ రూపంలో వినియోగదారుల నుంచి వసూలుచేస్తున్నారు.
తూర్పు డిస్కంలో భారీ వ్యత్యాసం..
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఫిబ్రవరి–2026లో ఏపీఈఆర్సీ ఆమోదించిన ధర యూనిట్‌కు రూ.5.1031 మాత్రమే. కానీ, డిస్కం రూ.6.6915కు విద్యుత్ కొనుగోలు చేసింది. అంటే.. యూనిట్‌కు రూ.1.5883 అదనంగా వెచ్చించింది. ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలను కలుపుకుని ఎఫ్‌పీపీసీఏ రూ.1.7539కు చేరగా, వినియోగదారులపై వసూలుచేయాల్సిన భారం రూ.2.0173గా నమోదైంది. అలాగే, ఏప్రిల్‌లో రూ.0.8956, జూన్‌లో రూ.1.1338, జులైలో రూ.0.7920, డిసెంబర్‌లో రూ.0.6717, జనవరిలో రూ.0.7321 చొప్పున అదనపు భారం నమోదైంది. ఆగస్టు (–0.6404), సెప్టెంబర్ (–0.3644)లో మాత్రమే తగ్గింది.
మధ్య డిస్కంలోనూ అదే పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఏప్రిల్‌లో ఆమోదించిన ధర రూ.5.3581 కాగా.. వాస్తవ కొనుగోలు ధర రూ.6.4469. అంటే, యూనిట్‌కు రూ.1.0888 అదనంగా చెల్లించారు. దీంతో ఎఫ్‌పీపీసీఏ రూ.1.2147గా నమోదైంది. ఫిబ్రవరిలో ఆమోదించిన ధర రూ.5.1527 కాగా, కొనుగోలు ధర రూ.5.8978. వ్యత్యాసం 74.51 పైసలు. వినియోగదారులపై రూ.0.9149 అదనపు భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, ఏప్రిల్‌లో రూ.0.8854, జూన్‌లో రూ.0.5013, జులైలో రూ.0.4312, అక్టోబరులో రూ.0.5410, నవంబరులో రూ.0.5291 చొప్పున అదనపు భారం నమోదైంది. సెప్టెంబరులో మాత్రమే – 0.0031గా స్వల్ప ఉపశమనం కనిపించింది.
దక్షిణ డిస్కంలోనూ ఎక్కువకు కొనుగోళ్లు..
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో కూడా ఏప్రిల్‌లో ఆమోదించిన ధర రూ.5.4700 కాగా.. కొనుగోలు ధర రూ.6.4309. అంటే, యూనిట్‌కు 96.09 పైసలు అధికంగా చెల్లించారు. ఆగస్టులో ఈ వ్యత్యాసం రూ.1.1246 వరకు చేరింది. ఏప్రిల్‌లో రూ.0.6217, నవంబరులో రూ.0.1197, ఫిబ్రవరిలో రూ.0.4421 అదనపు భారం నమోదైంది. మే నుంచి అక్టోబరు వరకు కొన్నినెలల్లో ప్రతికూల విలువలు నమోదైనా, ఏడాది మొత్తం పరిశీలిస్తే ప్రజలపై భారమే అధికంగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ప్రజలపైనే భారం..
విద్యుత్ కొనుగోలు ప్రణాళికలో లోపాలు, డిమాండ్ అంచనాల్లో పొరపాట్లు, ఖరీదైన స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడటం వంటి కారణాలతో డిస్కంల వ్యయం పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఆ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం భరించకుండా నేరుగా ఎఫ్‌పీపీసీఏ పేరుతో వినియోగదారులపై మోపడం అన్యాయమని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే వివిధ పేర్లతో పెంచిన విద్యుత్ చార్జీలతో బిల్లులు రెట్టింపు వస్తున్నాయని గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకూ వసూలుచేసిన మొత్తం ట్రూ అప్ చార్జీలను తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముందే వసూలుచేసి ఇప్పుడు గొప్పలా..
అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మరోలా డబ్బా కొట్టుకుంటోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు.. 2025–26కు రూ.2,800.28 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుచేసింది. ఇలా ఇప్పటివరకూ వేసిన భారం రూ.21,072.82 కోట్లు. ఇదికాక మరో రూ.555.30 కోట్ల భారం వేసేందుకు రెడీగా ఉంది. ఈ లెక్కన మొత్తం రూ.21,628.12 కోట్ల విద్యుత్ చార్జీల షాక్ ఇచ్చింది. అయితే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో అధికంగా వసూలుచేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. దానినే యూనిట్‌కు రూ.0.13 పైసలు చొప్పున ప్రభుత్వం వినియోగదారులకు వెనక్కిస్తోంది.
ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే ఇస్తున్నట్లు డప్పు కొట్టుకుంటోంది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,800.28 కోట్లు వసూలుచేశాయి. కానీ, అనుమతించిన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1,918.32 కోట్లు మాత్రమే. అంటే.. రూ.881.96 కోట్లు ఎక్కువ వసూలుచేసేశారు. క్యారీయింగ్ కాస్ట్ రూ.58.11 కోట్లతో కలిపి రూ.940.07 కోట్లు అదనంగా లాగేశారు. దీనిని కూడా ఏపీఈఆర్‌సీ ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పే అవకాశముంది. దీంతో కూటమి నేతలు ఆ రూ.940.07 కోట్లు తామే తగ్గించామంటూ ముందుగానే తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికిది ప్రజల నుంచి ఇప్పటికే వసూలుచేసిన సొమ్మే.


