శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల మండలం పొన్నాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో ఈగల మందు కలిసిన టీ తాగిన ఘటనలో పీఈటీ, సెక్యూరిటీ గార్డు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఘటన చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం కేజీబీవీ వంటగదిలో తయారు చేసిన టీని సిబ్బంది, విద్యార్థులకు పంపిణీ చేశారు. కొంతసేపటి తర్వాత ఓ ప్రత్యేక పాత్ర(జగ్గు)లో ఉన్న టీని పీఈటీ సన్యాసమ్మ, సెక్యూరిటీ గార్డు టి.ఉష తాగారు. వాసన తేడాగా ఉండటంతో పీఈటీ కొంచెం మాత్రమే టీ తాగి ఉమ్మేశారు.
తోటమాలినే ఈ పని చేసింది: పీఈటీ ఆరోపణ
పీఈటీ సన్యాసమ్మ కేజీబీవీలో తోటమాలిగా పనిచేస్తున్న ఓ మహిళ రెండు రోజుల కిందట కిచెన్‌లో పాలు తీసుకువెళ్లిపోతుండగా అడ్డుకుని ప్రశ్నించానని, ఇది మనసులో పెట్టుకుని టీలో ఈగల మందు కలిపిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ సూర్యకళ మాట్లాడుతూ.. ఈగల మందు కలిసిన టీ తాగడంతో సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని తోటమాలి చెప్పిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.


