దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్‌సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్‌జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.
అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్‌జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్‌లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్‌సీఆర్‌ఏ కింద నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు.
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.
ఎఫ్‌సీఆర్‌ఏకు 2020 సవరణల అనంతరం ఎన్‌జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్‌జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు.


