రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ | FM Nirmala Sitharaman present Rs 53. 5 lakh crore budget 2026-27 | Sakshi
Sakshi News home page

రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌

Feb 2 2026 5:24 AM | Updated on Feb 2 2026 5:24 AM

FM Nirmala Sitharaman present Rs 53. 5 lakh crore budget 2026-27

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

తయారీ, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27వ సంవత్సరానికి సంబంధించి ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2026–27  ఆర్థిక సంవత్పరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు. దేశ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలను ప్రతిపాదించారు. గ్లోబల్‌ డేటా సెంటర్లకు టాక్స్‌ హాలిడేను ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అదేవిధంగా వ్యవసాయం, పర్యాటక రంగాలకు పలు రాయితీలను ప్రతిపా దించారు. 

అంతర్జాతీయ పెరుగుతున్న అస్థిరతల నేపథ్యంలో...దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బ్లూప్రింట్‌ను ఆమె ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్  వరసగా 9 సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రి ఇన్ని సార్లు ఆర్థికపద్దును సభ ముందుకు తేవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధానమంత్రి, దివంగత మొరార్జీ దేశాయ్‌ అందరికంటే ఎక్కువగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

ఎంఎస్‌ఎంఈకి రూ.10వేల కోట్ల ఫండ్‌
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ ఎంఈ) ఛాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్‌ ఫండ్‌ను తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఆదివారం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

మన కర్తవ్యం నెరవేర్చుకో వడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూ డు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చు కోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ అని వివరించారు.  ఇందులో భాగంగా ఎంఎస్‌ఎస్‌ఈలు ఛాంపియ న్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్‌ ఇంజన్ కు ఎంఎస్‌ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. 

రక్షణ రంగానికి సింహ భాగం
పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్‌ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రకటించింది. 

ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. పాకిస్తాన్ పై ‘ఆపరేషన్  సింధూర్‌’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. కొత్త ఆ యుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్‌ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. 

వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌: ప్రధాని మోదీ
ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వికసిత్‌ బారత్‌కు రోడ్‌మ్యా ప్‌ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. ‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్‌. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. 

అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్‌ ఒక రహదారి. వికసిత్‌ భారత్‌–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం. మేక్‌ ఇన్  ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి  రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదిసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. 

Advertisement
 
Advertisement
Advertisement