సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యూట్యూబ్‌లో చిన్న పిల్లల చేత అసభ్యకరమైన కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న వారికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వ్యూస్ వేటలో నైతిక విలువలు మరిచి కంటెంట్, వీడియోలు చేసిన యూట్యూబర్‌ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వివరాల మేరకు.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం బరితెగిస్తున్న కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేసి.. వీడియోలు అప్‌లోడ్ చేసిన కంబేటి సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కగా, 15 నుంచి 17 ఏళ్ల బాలబాలికలతో ఇంటర్వ్యూ చేసిన సత్యమూర్తి.. అసభ్య ప్రశ్నలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు.. వారిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ల విషయంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన ఇంటర్వూలకు పాల్పడినా.. కంటెంట్ క్రియేట్ చేసినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


