ప్రభుత్వ అనుమతి కోసం గ్రామస్తుల ప్రయత్నం
హిడ్మా లేకున్నా అభివృద్ధి కార్యక్రమాలు ఆపొద్దు
ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన ఆదివాసీలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా సొంతూరైన పువర్తిలో స్మారక స్తూపం నిర్మించేందుకు బస్తర్ ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ స్మారక స్తూపం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా చేయాలంటూ మీడియా ప్రతిని«ధులు, ప్రజాసంఘాలను వారు కోరుతున్నారు. హిడ్మా అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్థానిక ఆదివాసీలు తమ వివరాలు గోప్యంగా ఉంచాలనే షరతుపై ఓ యూట్యూబ్ చానల్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు.
వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మా ఆదివాసీల కోసం హిడ్మా ఎంతో చేశాడు. అతడిని ఎదుర్కొనేందుకే ప్రభుత్వాలు మా ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన రోడ్లు, వంతెనలు, కరెంటు, ఇంటర్‌నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు అతడు చనిపోయాడు కదా అని ఆ అభివృద్ధి పనులను మధ్యలో ఆపొద్దు. వాటిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా నాయకుడికి గుర్తుగా స్మారక స్తూపం నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. ఈ మేరకు అవసరమైన సహకారాన్ని సమాజం నుంచి ఆశిస్తున్నాం’అని వారు వెల్లడించారు.
దేవాను చంపకండి: ‘హిడ్మా అంత్యక్రియల సందర్భంగా అతని మృతదేహాన్ని పరిశీలిస్తే తూటా గాయాల కంటే కత్తితో చేసిన గాయాలే ఎక్కువగా శరీరంపై ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోతే ఇలా జరగదు కదా. గతంలో నిరాయుధులుగా జవాన్లు దొరికితే, హిడ్మా బందీలుగా తీసుకున్నాడే తప్ప ఎప్పుడూ వారికి ప్రాణ హాని తలపెట్టలేదు. ప్రజాకోర్టులో చర్చలు జరిపి గౌరవంగానే వారిని విడిచిపెట్టా డు. మా గ్రామం నుంచి బార్సే దేవా ఇంకా పారీ్టలోనే ఉన్నాడు. లొంగిపోవడానికి వస్తే దయచేసి చంపొద్దు. అతడిని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, జీవితాంతం జైల్లో ఉంచండి’అని పువర్తిలో ఉన్న ఆదివాసీలు ప్రభుత్వాలను కోరుతున్నారు.


