breaking news
Main leaders
-
లొంగిపోనున్న మరో కీలక దళం నేత! ఎవరంటే..
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్‌గఢ్‌లోని అబుజ్మాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది. ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్లో)ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే! -
కమలంలో కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం. మాకేదీ గుర్తింపు..? రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్లతోనే అమిత్ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటల తీరుపై అసహనం! గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వారు నిత్య అసంతృప్త వాదులే..! మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు. అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్ సర్కార్‌కు, బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. -
రూటు మార్చిన తెలంగాణ కాంగ్రెస్.. పార్టీలోకి కీలక నేతలు
-
టార్గెట్ ‘గ్రేటర్’
- ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నిరసన గళం - త్వరలో గ్రేటర్ పార్టీకి కొత్త నాయకత్వం - జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యరంగంలోకి దిగింది. తెలంగాణ పార్టీ ముఖ్య నేతలే ఆయా నియోకవర్గాల సమన్వయకర్తల బాధ్యతలను తీసుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపే కసరత్తును ప్రారంభించారు. ఆదివారం ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాలకు ఓ మోస్తరుగానే కార్యకర్తలు హాజరయ్యారు. మిగిలిన నియోజకవర్గాల్లో సోమ, మంగళ వారాల్లో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే గత సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న నగరం తదనంతర పరిణామాలతో పూర్తిగా డీలా పడిపోయింది. ఈ ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేసే దిశగా పీసీసీ, సీఎల్పీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే ఆరుణ, గీతారెడ్డి, సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆదివారం నగరంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కుత్బుల్లాపూర్, సనత్‌నగర్‌లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తల హాజరు పలుచగానే కనిపించింది. ఉప్పల్‌లో ఎంపీ సర్వే వర్గీయులు గైర్హాజరయ్యారు. త్వరలో గ్రేటర్ కమిటీకి కొత్త రూపు ఇటీవలి ఎన్నికల్లో నగరంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త రూపు ఇచ్చే కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది వైఫల్యాలను నిలదీసే నిమిత్తం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల అనంతరం, డివిజన్ వారిగా ఆందోళనలు నిర్వహించే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. రెండవ దశ కార్యక్రమాల అనంతరం పార్టీలో అన్ని వర్గాల నాయకులతో సంప్రదించి గ్రేటర్ కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకున్ని నియమించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ కమిటీ బాధ్యతలు చూస్తున్న నాయకులకు పీసీసీలో స్థానం కల్పించి కొత్తవారికి నగర బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
'సూత్రదారులను శిక్షించాలి'


