
భద్రాద్రి కొత్తగూడెం: లొంగిపోయే ముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చివరిసారిగా తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వదిలిపెడుతున్నామని.. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన అన్నారు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.
‘‘ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్నుకాంటాక్ట్ చేయండి. సహచరులందరూ ఎక్కడవాళ్లు అక్కడే లొంగిపోవడం మంచిది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఉద్యమంలో అమరులైన వారందరికీ జోహార్లు’’ అంటూ ఆశన్న ప్రసంగించారు.
కాగా, అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశన్న ఛత్తీస్‌గఢ్ మీడియాతో మాట్లాడారు. ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందన్నారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది. గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు.