
అరుణాచల్, అస్సాంలపై పెను ప్రతికూలప్రభావం చూపనున్న డ్యామ్
బీజింగ్: చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహ మార్గంలో మొదలెట్టింది. సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంల నీటి అవసరాలు తీర్చే బ్రహ్మపుత్రపై ఇంతటి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తమపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా అవేం పట్టించుకోకుండా చైనా ఏకపక్షంగా వ్యవహరించింది. 167.8 బిలియన్ డాలర్ల అంచనావ్యయంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తోంది.
బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లాంగ్ జాంగ్‌బోగా పిలుస్తారు. నింగ్చీ నగరంలో శనివారం చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. టిబెట్ ప్రాంతంలోని నింగ్చీ మెయిన్‌లింగ్ జలవిద్యుత్ కేంద్రం వద్ద ఈ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టుగా రికార్డులకెక్కనుంది.
ప్రాజెక్ట్‌లో భాగంగా 1.2 ట్రిలియన్ యువాన్ల అంచనావ్యయంతో వేర్వేరు చోట్ల ఐదు హైడ్రోపవర్ స్టేషన్లను నిర్మించనున్నారు. 2023నాటి ఓ నివేదిక ప్రకారం ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ పూర్తయితే దీని ద్వారా ఏటా ఏకంగా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యంకానుంది. ఇది 30 కోట్ల మంది చైనీయుల ఏడాది అవసరాలను సరిపోతుంది. ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను అధికశాతం విదేశాలకు సరఫరాచేయనున్నారు.
కీలక ప్రాంతంలో నిర్మాణాన్ని తప్పుబట్టిన భారత్
ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ కొత్త డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తనకు నచ్చినప్పుడు నీటిని విడుదలచేస్తూ, నీటిని డ్యామ్‌లో పట్టి ఉంచుతూ నదీజలాలపై చైనా గుత్తాధిపత్యం వహించే ప్రమాదముందని భారత్ అభ్యంతరాలను ఇప్పటికే వెల్లడించింది.
మరోవైపు తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలోనే ఈ డ్యామ్‌ను నిర్మిస్తుండటంతో డ్యామ్ పటిష్టతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. అద్భుత నిర్మాణాలకు పేరెన్నికగన్న చైనా ఈ డ్యామ్‌ను అత్యంత పటిష్టంగా నిర్మించనుందని వార్తలొస్తున్నా భారత్ తన నదీజలాల పరిరక్షణ ప్రమాదంలో పడిందని ఇప్పటికే చైనాకు అధికారికంగా సమాచారమిచ్చింది. గతేడాది డిసెంబర్ 18న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.