బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు

China will build a major hydropower project on Brahmaputra river - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్‌ డ్యామ్‌

ఆమోదం తెలిపిన చైనా పార్లమెంట్‌

పంచవర్ష ప్రణాళికలో భాగంగా జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం

భారత్, బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరాలు

బీజింగ్‌: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే  చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో  కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (సీపీసీ) ఆమోదించింది.

అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్‌ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్‌ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రపంచంలోనే ఎత్తయిన నది
కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్‌ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై  దృష్టి పెట్టింది. జల విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్‌ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్‌ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్‌ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ ప్రపంచంలో భారీ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్‌ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్‌ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా.

భారత్‌ ఆందోళనలేంటి?
టిబెటన్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్‌) బ్రహ్మపుత్రపై (యార్లంగ్‌ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్‌ డ్యామ్‌ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు.

హాంకాంగ్‌ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ
హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్‌ గవర్నింగ్‌ హాంకాంగ్‌ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్‌ తమకు నచ్చినవారిని నామినేట్‌ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి.  ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0  ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది.

తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి 

Read also in:
Back to Top