
జల్పాయ్‌గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.
జల్పాయ్‌గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్‌ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్‌ఐఆర్‌లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.