
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్‌కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది.
బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.