
2030కల్లా రూ. 45,000 కోట్లు
రూ. లక్ష కోట్ల ఆదాయంపై కన్ను
కొత్తగా ఈవీ ఎస్‌యూవీ తయారీ
2027కల్లా లగ్జరీ బ్రాండ్ జెనిసిస్ రెడీ
ముంబై: కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్‌ఎంఐఎల్) దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. దక్షిణ కొరియా మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కో ప్రెసిడెంట్, సీఈవో జోస్ మునోజ్ 2030కల్లా దేశీ యూనిట్ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా హ్యుందాయ్ కార్ల తయారీ, అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా రెండోపెద్ద కేంద్రంగా భారత్ నిలవనున్నట్లు తెలియజేశారు. భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న మునోజ్ ఎగుమతుల్లో హెచ్‌ఎంఐఎల్ వాటా 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు.
అంతేకాకుండా వృద్ధి లక్ష్యాలలో భాగంగా కంపెనీ ఆదాయాన్ని సైతం 1.5 రెట్లు పెంచుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించే ప్రణాళికల్లో ఉన్నట్లు హెచ్‌ఎంఐఎల్ ఎండీ అన్సూ కిమ్ తెలియజేశారు. ఇందుకు వీలుగా 2030కల్లా 26 ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో 7 కొత్త ప్రొడక్టులకు కంపెనీ తెరతీయనుంది. తద్వారా ఎంపీవీ, ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటితోపాటు 2027కల్లా స్థానికంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీ మార్కెట్‌కోసం తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఈ బాటలో లగ్జరీ విభాగ బ్రాండ్ జెనిసిస్‌ను దేశీయంగా 2027కల్లా విడుదల చేయాలని ఆశిస్తోంది.
మూడు దశాబ్దాలు
దేశీయంగా మూడు దశాబ్దాల విజయం తరువాత గతేడాది ఐపీవో ద్వారా కంపెనీ లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మునోజ్ కంపెనీ తొలిసారి నిర్వహించిన ఇన్వెస్టర్ డే సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 2030కల్లా రూ. 45,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల్లో 60 శాతం ప్రొడక్ట్, ఆర్‌అండ్‌డీపైనా.. మిగిలిన 40 శాతం సామర్థ్య విస్తరణ, అప్‌గ్రెడేషన్ కోసం వినియోగించనున్నట్లు వివరించారు.
అమ్మకాలరీత్యా ప్రస్తుతం హ్యుందాయ్‌కు భారత్ మూడో పెద్ద మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. కాగా.. కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ 2026 జనవరి 1నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలిసారి భారతీయ వ్యక్తికి సారథ్యం అప్పగించడమనేది మాతృ సంస్థకు దేశీ కార్యకలాపాలపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. హ్యుందాయ్ క్యాపిటల్ దేశీయంగా 2026 రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.
చిన్న కార్లు వీడేదిలేదు
దేశీయంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఉన్నదని మునోజ్ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్ కావడానికి వీలయ్యే చిన్న కార్ల విభాగాన్ని వీడబోమని స్పష్టం చేశారు. ఎంట్రీలెవల్ కస్టమర్లు తదుపరి దశలో అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలయ్యే ప్రొడక్టులపైనా దృష్టి కొనసాగించనున్నట్లు తెలియజేశారు. భారత్‌ను రెండు మార్కెట్లుగా పేర్కొనవచ్చని, గ్లోబల్ మార్కెట్ల తరహాలో మరిన్ని ఎస్‌యూవీలు, ఆఫ్‌రోడ్ వాహనాలకు వీలున్నట్లే మరోపక్క ఎంట్రీలెవల్ కార్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.