సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రయాణికులకు ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి తరచూ ఎదురయ్యే సమస్య రిఫ్యూజల్‌గా పిలిచే తిరస్కరణ. ఓ ప్రాంతానికి వెళ్లాలని వాహనం బుక్ చేసుకుంటే కొందరు డ్రైవర్లు ఆ ట్రిప్‌ను క్యాన్సిల్ చేయడమో, ప్రయాణికుడి వరకు వచి్చన తర్వాత రామని చెప్పి వెళ్లిపోవడమో చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి ఇలాంటి సమస్య ఎవరికీ ఎదురుకాకూడదని భావించిన నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆయా అద్దె వాహనాల డ్రైవర్లు ప్రయాణికులు కోరిన చోటుకు వెళ్లాల్సిందేనని, తిరస్కరిస్తే మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన అధికారిక ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు. ఎవరికైనా ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి రిఫ్యూజల్ సమస్య ఎదురైతే 94906 16155 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
ఈ ఫిర్యాదులో వాహనం వివరాలతో పాటు రిఫ్యూజల్ జరిగిన సమయం, ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్ షాట్ కచ్చితంగా ఉండాలని సజ్జనర్ సూచించారు. ‘న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు. వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కొత్వాల్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నగరంలోని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నామని పేర్కొన్నారు.


