సజ్జనార్‌ అలా మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధం | BRS Harish rao Slams Hyderabad CP Sajjanar Over Phone Tapping Case | Sakshi
Sakshi News home page

సజ్జనార్‌ అలా మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధం

Feb 2 2026 11:21 AM | Updated on Feb 2 2026 1:25 PM

BRS Harish rao Slams Hyderabad CP Sajjanar Over Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: నగర కమిషనర్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారి వీసీ సజ్జనార్‌పై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సజ్జనార్‌ చేసిన ట్వీట్‌పై.. సోమవారం ఎక్స్‌ ఖాతాలో హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. 

‘‘ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తికాకముందే.. అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్ధం. సజ్జనార్‌ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధం. కోర్టులు తేల్చే వరకు అన్నీ ఆరోపణలే కదా. అలాంటప్పుడు అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ అని సజ్జనార్‌ ఎలా అంటారు?. అక్రమమా.. సక్రమమా అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఆయన వ్యాఖ్యలు విచారణపై అనుమానాలకు తావిస్తోంది’’ అని హరీష్‌ రావు అన్నారు. 

సిట్ చీఫ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ ముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్‌కు ఎవరిచ్చారు?. కేసీఆర్‌ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సజ్జనార్ గుర్తించడం లేదని హరీష్‌రావు అన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనని.. తీర్పు ఇవ్వడం కాదు అని అన్నారాయన. 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆదివారం నందినగర్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సిట్‌ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సజ్జనార్‌ పేరు ఎక్స్‌లో కాసేపు ట్రెండింగ్‌లో కొనసాగడం గమనార్హం. ఇక ఈ కేసులో హరీష్‌రావును సిట్‌ విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement