సాక్షి, విజయవాడ: భవానీపురంలో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ఇంటి ముందు బాధితులు బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని భవానీపురం బాధితులు కోరుతున్నారు. నిన్న విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. తక్షణమే కూల్చివేతలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్డర్ కాపీ అందేలోపే ఇళ్లను అధికారులు కూల్చేశారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు విలపిస్తున్నాయి.

విజయవాడలో ఇళ్ల కూల్చివేత దారుణమని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇందులో పలువురు నేతల హస్తం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పోతిన మహేష్ అన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌ను బాధితులు ముట్టడించారు. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫ్లాట్స్‌ను అన్యాయంగా కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కూల్చొద్దని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అన్యాయంగా మా ఫ్లాట్లను కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై ఎంక్వయిరీ చేయాలి. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వద్దకు కూడా వెళ్తామని బాధితులు అన్నారు.



