
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి క్వాలిఫై
థాయిలాండ్‌పై 2–1తో విజయం
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్‌ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్‌చవాన్ రాడ్‌థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్‌ను ఓడించలేదు.
క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్‌లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది.