
అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియెల్ నారోడిట్‌స్కీ (Daniel Naroditsky) హఠాన్మరణం చెందాడు. 29 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచాడు. డానియెల్ కోచ్‌గా పనిచేస్తున్న.. ‘ది చార్లెట్ చెస్ క్లబ్’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
డానియెల్ ఇకలేరు
‘‘ప్రతిభావంతుడైన చెస్ క్రీడాకారుడు. గొప్ప కోచ్. చెస్ కమ్యూనిటీలో అందరికీ అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఆట పట్ల ఆయన ప్రేమ, అంకితభావం అసాధారణం. ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా నిలిచిన డానియెల్ ఇకలేరు’’ అంటూ డానియెల్ కుటుంబం అతడి మరణవార్తను తమకు తెలియజేసినట్లు.. నార్త్ కరోలినాలోని ఈ క్లబ్ ప్రకటన విడుదల చేసింది.
చివరగా..
అయితే, డానియెల్ మరణానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. బాల్యం నుంచే చదరంగంపై మక్కువ పెంచుకున్న డానియెల్ అండర్-12 వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాడు. టీనేజ్‌లోనే చెస్ స్ట్రాటజీ బుక్స్ కూడా రాశాడు. కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకున్న డానియెల్.. చివరగా ఈ ఏడాది ఆగష్టులో యూఎస్ నేషనల్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ గెలిచాడు.
కాగా తన గేమ్‌లను అభిమానులంతా ప్రత్యక్షంగా వీక్షించాలని డానియెల్ కోరుకునేవాడు. అలా వీలుకాని వాళ్ల కోసం లైవ్‌స్ట్రీమింగ్ చేయించేవాడు. ఈ విషయం గురించి అమెరికాకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హికారు నకముర మాట్లాడుతూ.. ‘‘అతడికి మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇష్టం.
నేను వెళ్లిపోయానని అనుకున్నారా?
తద్వారా ఇతరులకు కూడా చెస్ గురించి నేర్చుకునే వీలు ఉంటుంది అనేవాడు. చెస్ ప్రపంచం అతడికి ఎంతగానో రుణపడి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే డానియెల్.. చాన్నాళ్ల తర్వాత చివరగా పోస్ట్ చేసిన వీడియోలో..
‘‘నేను వెళ్లిపోయానని మీరు అనుకున్నారా?.. మునుపటి కంటే మెరుగ్గా తిరిగి వస్తాను’’ అని పేర్కొన్నాడు. అయితే, అంతలోనే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.
జూనియర్ చెస్ ప్లేయర్లకు కోచ్‌గా
కాగా డానియెల్ నారోడిట్‌స్కీ మృతి పట్ల అమెరికా చెస్ ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా అజర్‌బైజాన్, ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వచ్చిన యూదు వలసదారుల కుటుంబానికి చెందినవాళ్లలో డానియెల్ ఒకడు.
కాలిఫోర్నియాలోని సాన్ మటియోలో జన్మించిన డానియెల్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో 2019లో హిస్టరీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అతడు నార్త్ కరోలినాకు తన మకాం మార్చాడు. అక్కడే చార్లెట్ క్లబ్‌లో జూనియర్ చెస్ ప్లేయర్లకు కోచ్‌గా మారాడు.
చదవండి: SL vs BAN: 4 బంతుల్లో 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఓటమి