
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్య చేధనలో అద్భుతంగా పోరాడిన బంగ్లా బ్యాటర్లు.. ఆఖరిలో చేతులుత్తేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
బంగ్లా విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ వేసే బాధ్యతను శ్రీలంక కెప్టెన్ చమిరి అతపట్టు తీసుకుంది. చివరి ఓవర్‌లో అతపట్టు అద్భుతం చేసింది. తొలి బంతికే రబేయా ఖాన్ ఎల్బీగా ఔటయ్యింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్. మూడో బంతికి సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
మళ్లీ నాలుగో బంతికి మరుఫా అక్తర్ ఎల్బీగా వెనుదిరిగింది. లంక కెప్టెన్ దెబ్బకు బంగ్లా జట్టు వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చేంది. దీంతో బంగ్లా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా బ్యాటర్లలో షర్మిన్ అక్తర్(64),నిగర్ సుల్తానా(77) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. లంక బౌలర్లలో చమిరి ఆతపట్టు నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుమారి రెండు, ప్రభోధిని ఓ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆతపట్టు(46),నీలాక్షి డిసిల్వా(37) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరినా అక్తర్ మూడు, రబియా ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు.ఈ ఓటమితో బంగ్లా జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.
చదవండి: రిజ్వాన్‌పై వేటు.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?