
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వన్డే జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై పీసీబీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని పీసీబీ సెలక్షన్ కమిటీ నియమించింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ నుంచి పాకిస్తాన్ వన్డే జట్టు పగ్గాలను అఫ్రిది చేపట్టనున్నాడు.
రిజ్వాన్ సారథ్యంలో పాక్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన మెన్ ఇన్ గ్రీన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లను కూడా కోల్పోయింది. రిజ్వాన్ నాయకత్వంలో పాక్ కేవలం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై మాత్రమే వన్డే సిరీస్ విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే రిజ్వాన్‌ను కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు.
సోమవారం పాకిస్తాన్ సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వన్డే జట్టు కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిదిని ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాక్ వన్డే జట్టుకు షాహీన్ నాయకత్వం వహిస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
దీంతో పాక్ జట్టుకు ఇప్పుడు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టుల్లో షాన్ మసూద్ పాక్ సారథి ఉండగా.. టీ20ల్లో సల్మాన్ అలీ అఘా, వన్డేల్లో షాహీన్ సారథిలుగా ఉన్నారు. షాహీన్ ఇంతకుముందు పాక్ టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో పాక్ కోల్పోవడంతో అతడిని కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు.
మళ్లీ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లో పాక్ జట్టు పగ్గాలను చేపట్టేందుకు అఫ్రిది సిద్దమయ్యాడు. 25 ఏళ్ల షాహీన్ పాకిస్తాన్ తరపున 66 వన్డేలు ఆడి 131 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడుతోంది.
చదవండి: సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్