
నేటి నుంచి ఐరాస సర్వప్రతినిధిసభ 80వ సమావేశం
విశ్లేషణ
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్‌ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్‌లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి.
ఎనభై అన్నది కీలక ఘట్టం
అంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది.
నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది.
ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!
ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్‌లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే.
‘శాంతి కోసం సమైక్యత’
అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్‌కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది.
‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్‌పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు.
చెప్పుకోదగిన విజయాలు
రెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం.
ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి.
అమెరికా–ఐరాస పోలికలు
అంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్‌కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్‌లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది.
అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు.
డేనియల్ వార్నర్
వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత