
కప్ లేకపోయినా మా విజయం విలువ తగ్గదు
భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్య
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు.
‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం.
పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు.
నఖ్వీ తీసుకెళ్లిపోయాడు!
ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు.
అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది.
బీసీసీఐ ఆగ్రహం...
నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు.
మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు.
తిలక్ వర్మకు ఘన స్వాగతం...
అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు.
అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు.