ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న పాకిస్తాన్ జట్టు... కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్ మహమూద్‌ను టెస్టు హెడ్ కోచ్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం.
గత రెండేళ్లుగా జాతీయ జట్టుకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న అజహర్ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రయత్నాలు ప్రారంభించింది.
మరోసారి ‘హెడ్‌కోచ్’పై వేటు
డబ్ల్యూటీసీ 2025–27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడి 50 పాయింట్ల శాతంతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది టెస్టు ఫార్మాట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అజహర్ (Azhar Mahmood) కాంట్రాక్టు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. అయితే అంతకుముందే అతడిని తొలగించేందుకు సిద్ధమైంది.
ప్రధాన కోచ్‌తో పాటు
‘మార్చితో అజహర్ మహమూద్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అయితే మ్యాచ్‌ల ఆరంభానికి ముందే కొత్త కోచ్‌ను నియమించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తోంది’ అని ఓ అధికారి తెలిపారు. ప్రధాన కోచ్‌తో పాటు మొత్తం శిక్షణ బృందం కోసం పీసీబీ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ జట్టు... బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
జట్టు ఎంపిక విషయంలో పొరపొచ్చాలు రావడంతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసెన్ గిలెస్పీ గతేడాది టెస్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మొదట ఆఖిబ్ జావేద్, ఆ తర్వాత అజహర్ మహమూద్ ఆ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. మహిళల జట్టు కోసం కూడా కొత్త కోచింగ్ సిబ్బంది కోసం పాకిస్తాన్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.


