
63వ ర్యాంక్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడు స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్‌లో నిలిచింది. గత రెండేళ్లలో భారత జట్టుకిదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. 2023 ఆగస్టులో టీమిండియా 61వ స్థానంలో నిలిచింది.
2013లో భారత జట్టు తమ అత్యుత్తమ ర్యాంక్ (49)ను అందుకుంది. థాయ్‌లాండ్‌లో ఇటీవల జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. భారత్... మంగోలియాపై 13–0తో... 4–0తో తిమోర్ లెస్టెపై, 5–0తో ఇరాక్‌పై, చివరి మ్యాచ్‌లో 2–1తో థాయ్‌లాండ్‌పై గెలిచింది.
‘టాప్’ ర్యాంక్‌లో స్పెయిన్
మరోవైపు యూరోపియన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న అమెరికాను స్పెయిన్ రెండో స్థానానికి నెట్టేసింది. స్వీడన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా... యూరోపియన్ టైటిల్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్ ఒక స్థానం పురోగతి సాధించి నాలుగో ర్యాంక్‌లో నిలిచింది.