
యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్
ఈ సీజన్‌లో ఐదో విజయం సాధించిన డిఫెండింగ్ చాంపియన్
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ అవకాశాలు సజీవం
ఆస్టిన్ (అమెరికా): ఫార్ములావన్ (ఎఫ్1) 2025 సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ మరోసారి సత్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్... ద్వితీయార్ధంలో అదరగొడుతున్నాడు. తాజాగా యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. గత నాలుగు రేసుల్లో అతడికిది మూడో విజయం కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ ఏడాది అతనికిది ఐదో టైటిల్. తుది రేసును ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించిన వెర్‌స్టాపెన్ వాయు వేగంతో దూసుకెళ్లాడు.
56 ల్యాప్‌ల రేసును అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా 1 గంట 34 నిమిషాల 0.161 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న మెక్‌లారెన్ డ్రైవర్లకు మరింత చేరువయ్యాడు. రేసు ఆరంభం నుంచే ప్రత్యర్థులకు అందకుండా దూసుకెళ్లిన డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ సగం రేసు అయ్యేసారికి రెండో స్థానంలో ఉన్న డ్రైవర్ కంటే 10 సెకన్ల ఆధిక్యంలో నిలిచాడు.
ఓవరాల్‌గా వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఇది 68వ టైటిల్. 24 రేసుల సీజన్‌లో 19 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ఆస్కార్ పియాస్ట్రి 346 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... లాండో నోరిస్ 332 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెర్‌స్టాపెన్ 306 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సీజన్‌లో మరో ఐదు రేసులు మిగిలుండగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్ అగ్రస్థానంలో ఉన్న పియాస్ట్రి కంటే వెర్‌స్టాపెన్ 40 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.
రెండో స్థానంలో ఉన్న నోరిస్‌కు, వెర్‌స్టాపెన్‌కు మధ్య 26 పాయింట్ల అంతరం ఉంది. పియాస్ట్రి, నోరిస్ కెరీర్‌లో తొలి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తహతహలాడుతుంటే... ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెర్‌స్టాపెన్ ఐదోది ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు.
‘ఇప్పుడే చెప్పలేం కానీ అవకాశం మాత్రం ఉంది. చివరి వరకు ఇదే జోరు కొనసాగిస్తే సీజన్ ముగిసేసరికి అగ్రస్థానానికి చేరడం కష్టం కాదు. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రేసు అనంతరం వెర్‌స్టాపెన్ పేర్కొన్నాడు. తదుపరి రేసు ఈ నెల 27 మెక్సికో గ్రాండ్‌ప్రి జరుగనుంది.