
ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడంతో నమ్మకం పెరిగింది
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ప్లేయర్ మనీషా వ్యాఖ్య
గువాహటి: ‘ఫిఫా’ ప్రపంచకప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లలో జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగడం తన కల అని భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు స్టార్ ప్లేయర్ మనీషా కల్యాణ్ పేర్కొంది. ఇటీవల చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరగనున్న ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. దీంతో భవిష్యత్తులో ఒలింపిక్స్, ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనగలమనే నమ్మకం పెరిగిందని మనీషా వెల్లడించింది.
శుక్రవారం గువాహటిలో జరిగిన ‘అస్మిత’ అండర్–13 బాలికల లీగ్ ప్రారంభోత్సవంలో మనీషా పాల్గొంది. ఈ సందర్భంగా 23 ఏళ్ల మనీషా మాట్లాడుతూ... ‘యంగ్‌ప్లేయర్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు ‘అస్మిత’ఒక్క చక్కటి వేదిక. వరల్డ్‌కప్‌లో పాల్గొనాలనేది నా చిరకాల కల. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరగనున్న ఆసియా కప్‌నకు అర్హత సాధించడంతో ఆ దిశగా మరింత నమ్మకం పెరిగింది’ అని పేర్కొంది. మారుమూల ప్రాంతాల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు ‘అస్మిత’ తోడ్పడుతోందని వెల్లడించింది.
అస్మిత గువాహటి లెగ్ పోటీల్లో 8 జట్లు పాల్గొంటుండగా... మనీషా ప్లేయర్లతో కాసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడింది. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్‌ఏ) చాంపియన్స్ లీగ్‌లో పాల్గొన్న ఏకైక భారత మహిళా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనీషా... ‘అస్మిత’వంటి వేదికతో యువ ఆటగాళ్లకు నాణ్యమైన మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుందని చెప్పింది. ‘అస్మిత’ లీగ్ ద్వారా వెలుగులోకి వచి్చన రేఖ కటాకీ, డొసోమి రోటియాను మనీషా ప్రత్యేకంగా అభినందించింది.
‘ఈశాన్య రాష్ట్రాల ప్రజల రక్తంలోనే ఫుట్‌బాల్ ఉంది. స్టార్ ప్లేయర్ బాలాదేవి ఆట చూస్తూ పెరిగాను. ప్రస్తుత భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో 11 మంది ఈశాన్య రాష్ట్రాల ప్లేయర్లు ఉన్నారు. ఇక్కడి ప్లేయర్లలో ఎంత నైపుణ్యం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో ఐదేళ్లలో ఈ చిన్నారుల్లో నుంచి కూడా కొందరు రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించవచ్చు. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుంది. ఫిట్‌నెస్, నైపుణ్యం పెంపొందించుకుంటే ఏదైనా సాధ్యమే.
ప్రభుత్వ సహకారంతో ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా మౌలిక వసతులు పెరుగుతున్నాయి. దీంతో మరింత మంది వెలుగులోకి వస్తున్నారు’ అని మనీషా వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల ఆటలకు ప్రాధన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం... తాజా ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో వాటిని చేర్చింది. ఈ పరిణామాన్ని మనీషా ఆహ్వానించింది. దీనివల్ల కేవలం ఫుట్‌బాల్‌కు కాకుండా... మిగిలిన ఆటలకు కూడా ఆదరణ పెరుగుతందని వెల్లడించింది.