పాకిస్తాన్ క్రికెట్ హెడ్‌కోచ్‌లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బందిలో కూడా తరచూ మార్పులు ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా టెస్టు హెడ్‌కోచ్ అజహర్ మహమూద్‌కు పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.
కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్‌ను సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ హెడ్‌కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి పీసీబీ తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాక్ కోచ్‌గా ఎందుకు తప్పుకొన్నారు?
‘ఎక్స్’ వేదికగా ఓ యూజర్.. ‘‘మీరు పాకిస్తాన్ కోచ్‌గా ఎందుకు తప్పుకొన్నారు’’ అని గిల్లెస్పిని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అప్పట్లో నేను పాకిస్తాన్ టెస్టు జట్టుకు కోచింగ్ ఇచ్చేవాడిని. నాకు తెలియకుండానే.. నలుగురు సీనియర్ అసిస్టెంట్ కోచ్‌లను చెప్పాపెట్టకుండా పీసీబీ తొలగించింది.
అవమానించారు
హెడ్‌కోచ్‌గా నాకిది అస్సలు నచ్చలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కూడా కాదు. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. పీసీబీ తీరు నన్ను కించపరిచేవిధంగా, అవమాపరిచేలా ఉండటం ఎంతో బాధించింది’’ అని జేసన్ గిల్లెస్పి సమాధానం ఇచ్చాడు.
కాగా తాను 2024లో పాక్ కోచ్‌గా ఉన్న సమయంలో పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వ్యవహరించిన తీరుపై జేసన్ గిల్లెస్పి.. బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. ‘‘జట్టులో సామరస్యం పెంచేందుకు ‘కనెక్షన్ క్యాంపు’ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచనతో గ్యారీ కిర్‌స్టన్ మా ముందుకు వచ్చాడు.
చైర్మన్ నక్వీ తీరు సరిగా లేదు
పాక్ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు ఇందులో తమ అనుభవాలు, ఇబ్బందుల గురించి చెప్పవచ్చు. ఈ మీటింగ్ కోసం నేను ఆస్ట్రేలియా నుంచి.. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చాము. కానీ చైర్మన్ నక్వీ మాత్రం జూమ్ కాల్‌లో హాజరయ్యాడు.
అతడు లాహోర్‌లోనే ఉంటాడు. అయినా సరే సమావేశానికి హాజరుకాలేదు. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చినపుడు.. చైర్మన్ 20 నిమిషాల కారు ప్రయాణంలో మీటింగ్‌కు చేరుకునే వీలున్నా రాకపోవడం అసాధారణంగా అనిపించింది’’ అని గిల్లెస్పి నక్వీ తీరును విమర్శించాడు.
చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా


