T20 WC: పాక్‌ మరో ‘యూటర్న్‌’!.. ఈసారి ఎవరంటే? | Shoaib Akhtar Embarrassing U-Turn After Calling Naqvi Illiterate | Sakshi
Sakshi News home page

T20 WC: పాక్‌ మరో ‘యూటర్న్‌’!.. ఈసారి ఎవరంటే?

Feb 17 2026 12:59 PM | Updated on Feb 17 2026 1:18 PM

Shoaib Akhtar Embarrassing U-Turn After Calling Naqvi Illiterate

టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ వరుస ‘యూటర్న్‌’లతో వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టోర్నీనే బహిష్కరిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొలుత సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

మాట మార్చడమే పని
ఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని భావించి.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామని ఏ​కంగా పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ప్రకటన చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) రంగంలోకి దిగడంతో ఈ విషయంలోనూ పాక్‌ మాట మార్చింది.

ఐసీసీతో పాటు పాక్‌ భద్రతా కారణాల గురించి మాట్లాడటంతో శ్రీలంక సైతం తమపై గతంలో పాక్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసింది. యూఏఈ కూడా పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఆఖరికి బంగ్లాదేశ్‌ సైతం భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ ఒత్తిళ్ల కారణంగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామంటూ పాక్‌ అతి పెద్ద యూటర్న్‌ తీసుకుంది. అన్నట్లుగానే కొలంబో వేదికగా పటిష్ట భారత్‌తో తలపడ్డ పాకిస్తాన్‌ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

నాలుక మడతేసిన అక్తర్‌
ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ చైర్మన్‌ , మంత్రి మొహ్సిన్‌ నక్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసమర్థ వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మండిపడ్డాడు. సీనియర్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ వరుసగా విఫలమవుతున్నా.. ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించాడు.

ఆట పట్ల అవగాహన లేని వ్యక్తి చైర్మన్‌ అయితే ఇలాగే ఉంటుందంటూ నక్వీని ఉద్దేశించి అక్తర్‌ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌ వైరల్‌ కాగా అక్తర్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో అతడు కూడా యూటర్న్‌ తీసుకున్నాడు. తాను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి.. ‘‘చదువులేని వాడు, అసమర్థుడు’’ అని అనలేదంటూ మాట మార్చాడు.

‘‘నేను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయనను అగౌరవపరచాలనే ఉద్దేశమే నాకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ క్రికెట్‌ దిగజారుతున్న తీరుపైనే నేను ఆవేదన వ్యక్తం చేశాను.

నక్వీ భాయ్‌ మంచి వ్యక్తి
అసమర్థులైన వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు అని మాత్రమే అన్నాను. అయితే, అది నక్వీ భాయ్‌ను ఉద్దేశించి మాత్రం కాదు. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అదే కార్యక్రమంలో నేను నక్వీ భాయ్‌ మంచి వ్యక్తి అని చెప్పాను. కానీ ఆ మాటలను ప్రసారం చేయలేదు.

అయితే, ఒక విషయంలో మాత్రం నక్వీ భాయ్‌పై నాకు నిజంగానే కోపం వచ్చింది. టీమిండియాతో ఆడమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. 

మీకసలు సిగ్గుందా?
అయినా సరే యూటర్న్‌ తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో పునరాలోచన చేసే ముందు నన్ను సంప్పదించాల్సింది’’ అని అక్తర్‌ తాను కూడా మాట మార్చేశాడు. ఈ నేపథ్యంలో ‘‘యూటర్న్‌ల మీద యూటర్న్‌లు.. మీకసలు సిగ్గుందా?’’ అంటూ నెటిజన్లు పీసీబీ, అక్తర్‌కు చివాట్లు పెడుతున్నారు.

చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement