
ఆసియ కప్ అండర్– 20 ఫుట్‌బాల్ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత
క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా అగ్రస్థానం
యాంగాన్ (మయన్మార్): భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టుతో స్ఫూర్తి పొందిన భారత జూనియర్ మహిళల జట్టు అద్భుతం చేసింది. 2006 తర్వాత ఆసియా కప్ అండర్–20 మహిళల టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం ముగిసిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాలుగు జట్లు పోటీపడ్డ గ్రూప్ ‘డి’లో టీమిండియా రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో ఏడు పాయింట్లు సాధించి టాపర్‌గా నిలిచి ఆసియా కప్ బెర్త్‌ను సంపాదించింది. 2026 ఆసియా కప్ అండర్–20 టోర్నీ థాయ్‌లాండ్‌లో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది.
గ్రూప్ ‘డి’లో భాగంగా మయన్మార్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 27వ నిమిషంలో పూజ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన టీమిండియా నిర్ణీత సమయం పూర్తయ్యే వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని అందుకుంది. తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చలాయించగా... రెండో అర్ధభాగంలో మయన్మార్ ఆకట్టుకుంది. నేహా, షిబాని దేవి సమన్వయంతో ముందుకు దూసుకెళ్లడంతో ఆట మూడో నిమిషంలో భారత్ గోల్ చేసినంత పని చేసింది.
మరోవైపు మయన్మార్ ఫార్వర్డ్ సు సు ఖిన్ తొమ్మిదో నిమిషంలో ఎదురుదాడికి దిగినా ఫినిషింగ్ లోపంతో గోల్ చేయలేకపోయింది. 27వ నిమిషంలో కుడి వైపు నుంచి మయన్మార్ గోల్ పోస్ట్ వైపునకు దూసుకెళ్లిన పూజ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్ బోణీ కొట్టింది. రెండో అర్ధభాగంలో మాత్రం సొంత ప్రేక్షకులు ఉత్సాహపరుస్తుండగా మయన్మార్ తమ దాడుల్లో పదును పెంచింది. పలుమార్లు భారత గోల్‌పోస్ట్ వైపు దూసుకొచ్చింది.
కానీ టీమిండియా గోల్‌కీపర్ మోనాలీసా దేవి సదా అప్రమత్తంగా ఉంటూ మయన్మార్ జట్టు ఆశలను వమ్ము చేసింది. ఈ మ్యాచ్‌కంటే ముందు భారత్... ఇండోనేసియాతో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకొని ... తుర్క్‌మెనిస్తాన్ జట్టుపై 7–0తో గెలిచింది. చివరిసారి భారత జట్టు 2006లో జరిగిన ఆసియా కప్ అండర్–20 టోర్నీలో పోటీపడి ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గకుండానే లీగ్ దశలోనే వెనుదిరిగింది.
25 వేల డాలర్ల నజరానా
రెండు దశాబ్దాల తర్వాత ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) నజరానా ప్రకటించింది. జట్టు మొత్తానికి 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 88 వేలు) అందజేస్తామని తెలిపింది.