2017 నవంబర్ 28న పట్టాలెక్కిన రైలు
మియాపూర్–అమీర్‌పేట్ రూట్‌లో మొదటి సర్వీసులు
ఇప్పటి వరకు విజయవంతంగా పీపీపీ ప్రాజెక్ట్
ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ప్రక్రియ వేగవంతం
వచ్చే ఏడాది మార్చి నాటికి కీలకదశకు చేరనున్న బదిలీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్ మెట్రోరైల్ ఎనిమిదో వసంతంలోకి ప్రవేశించింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా నగరంలో మెట్రో సేవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులకు మెట్రో సదుపాయం లభిస్తోంది. గత ఎనిమిదేళ్లలో హైదరాబాద్ మెట్రోరైల్ ఎన్నో మైలురాళ్లను దాటింది. కాగా.. భాగస్వామ్య సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది.
ప్రభుత్వం రెండో దశకు సన్నాహాలు చేపట్టిన క్రమంలో చోటుచేసుకున్న ఈ కీలక పరిణామం మెట్రో భవితవ్యాన్ని చర్చనీయాంశం చేసింది. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది.
వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందుకనుగుణంగా మెట్రో రెండో దశ డీపీఆర్‌లలో కూడా మార్పులు చేసి కేంద్రానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట అలైన్‌మెంట్ పనులు చేపట్టనున్నారు.
మెట్రో ప్రస్థానం ఇలా..
హైదరాబాద్ మెట్రోరైల్ 2017 నవంబర్ 28వ తేదీన పట్టాలెక్కింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోదీ తొలి సరీ్వసును ప్రారంభించారు. ఇది మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించింది. అదే సమయంలో నాగోల్–అమీర్‌పేట్ మధ్య మొత్తం 30 కి.మీ దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడాది తర్వాత అమీర్‌పేట్–ఎల్‌బీనగర్ మెట్రో కారిడార్ వినియోగంలోకి వచ్చింది. అమీర్‌పేట్– హైటెక్ సిటీ, హైటెక్‌సిటీ– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లు దశలవారీగా ప్రారంభమయ్యాయి. 2020 నాటికి మూడు కారిడార్‌లలో 69 కి.మీ మార్గంలో మెట్రో పరుగులు తీసింది. సుమారు రూ.22,148 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ఎలివేటెడ్ కారిడార్ మెట్రో ప్రాజెక్ట్.. ఢిల్లీ తర్వాత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 14వ తేదీన రికార్డుస్థాయిలో 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. మొదటి దశ తర్వాత రెండోదశ మెట్రో విస్తరణలో ప్రతిష్టంభన చోటుచేసుకోవడంతో రెండోస్థానం నుంచి క్రమంగా వెనుకబడిపోయింది.
వేగవంతంగా బదిలీ ప్రక్రియ..
హైదరాబాబాద్ మెట్రోరైల్ నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగడంతో ప్రస్తుతం యాజమాన్య బదిలీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ ప్రక్రియ పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు తెలిపారు. బదిలీ ప్రక్రియలో భాగంగా భాగస్వామ్య సంస్థ అయిన ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైళ్ల నిర్వహణ బాధ్యతల బదిలీని కూడా నిరీ్ణత వ్యవధిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్‌అండ్‌టీ వైదొలగనున్న దృష్ట్యా రూ.1,3000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ప్రస్తుతం మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా స్వా«దీనం చేసుకోనున్న దృష్ట్యా రెండో దశకు మార్గం సుగమమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా దశల వారీగా 625 కి.మీ మేరకు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.


