ములుగు జిల్లా : ధర్మవరం గ్రామ పంచాయతీకి ఈ సారైనా సర్పంచ్ ఎన్నిక జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు స్థానికుల్లో నెలకొంది. గత ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేదు. మొత్తం 8 వార్డులకు ఎన్నికలు జరగగా అందులో ఉప సర్పంచ్‌ని ఎన్నుకొని వారితోనే పాలన కొనసాగించారు. ఐదేళ్ల పాటు ఉప సర్పంచే బాధ్యతలను నిర్వహించారు. గత ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ మహిళలకు రిజర్వ్ అయింది.
ఇక్కడ పోటీ చేసేందుకు ఒకే మహిళ ఉండటం, ఆమె అంగన్‌వాడీ కేంద్రంలో ఉద్యోగి కావడంతో నామినేషన్ వేయలేక పోయింది. దీంతో ధర్మవరం గ్రామ పంచాయతీకి సర్పంచ్ లేకుండా పోయింది. ఈ గ్రామ పచాయతీలోలో ఈ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. గతంలో ధర్మవరం పంచాయతీ ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఇక్కడ నుంచి ఎవరూ పోటీ చేయక పోవడంతో ఎన్నికైన 8మంది వార్డు సభ్యుల నుంచి బొల్లె సూర్యంను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఐదేళ్ల పాటు ఆయనతోనే గ్రామపాలన సాగింది.
ధర్మవరంలో పెరిగిన ఎస్టీ ఓటర్లు..
ధర్మవరం గ్రామ పంచాయతీలో ఈసారి ఎస్టీ ఓటర్ల సంఖ్య పెరిగింది. మళ్లీ ఎస్టీ మహిళలకే సర్పంచ్ స్థానం రిజర్వు చేశారు. మొత్తం 710 ఓట్లు ఉండగా అందులో ఎస్టీ వర్గానికి 11ఓట్లు ఉన్నాయి. అవి కూడా మహిళల ఓట్లే కావడం విశేషం. ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా పలువురు మహిళలు ఆయా పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అయినా గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో అద్దె ›ఇంట్లోనే నిర్వహణ కొనసాగుతోంది.


