ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు.
ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల అనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతోపాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు.


