ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్‌.. ఇప్పుడిదే ట్రెండింగ్‌! | Bamboo flooring new trend house construction tips | Sakshi
Sakshi News home page

ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్‌.. ఇప్పుడిదే ట్రెండింగ్‌!

Oct 26 2025 4:16 PM | Updated on Oct 26 2025 5:48 PM

Bamboo flooring new trend house construction tips

శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కనిపించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. అనేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్‌)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూసేందుకు చక్కగా కనిపించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో

రెండు రకాలు.. 
వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్‌ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్‌ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్‌ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్‌ కోటింగ్‌ వేస్తారు.  

ధర ఎంత? 
ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–రూ.350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ 100 చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్‌ కు చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలప ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. ఒక్కరోజులో పని పూర్తవుతుంది. ఈ గచ్చు ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. దీనిపై గీతలు కనిపించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులు అక్కరలేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు.  

బుడతల గదికి ప్రత్యేకం.. 
సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్‌ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్‌పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల 
వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement