ఇల్లా, ఫ్లాటా.. లేక వాణిజ్య భవనాల్లో స్థలమా? దేంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ధర పెరగడానికి ఆస్కారముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి అందుకోవచ్చు? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి, నేటికీ అధికశాతం మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
అందుబాటు ప్రాంతాలిక్కడే..
నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య
సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని
తెలిసింది.
పక్కాగా చూడాలి
నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.
వాణిజ్య సముదాయాలా?
పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోలిస్తే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది.
ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గృహరుణాలతో పోలి్చతే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు.
నివాస సముదాయాలా?
మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో 20 శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. 20–25 ఏళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. 20 శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది.
నివాస సముదాయాల రంగంలో ఏటా 12–15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక నిర్వహణ మెరుగ్గా జరపాలి.
ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్!


