
చెన్నై: దక్షిణాఫ్రికా సంచలన బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్–2025 సీజన్ మధ్యలో జట్టులో తీసుకోవడం గురించి వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వివరణ ఇచ్చిoది. సీజన్ మధ్యలో గాయపడిన పేస్ బౌలర్ గుర్‌జప్‌నీత్ సింగ్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. దీని కోసం సీఎస్‌కే బ్రెవిస్‌కు రూ.2.20 కోట్లు చెల్లించింది. సీజన్ ఆరంభానికి ముుందు రూ.75 లక్షల కనీస విలువతో వచ్చిన బ్రెవిస్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోలేదు.
మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో బ్రెవిస్ 56 బంతుల్లోనే 125 పరుగులు బాది వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే టీమ్ సభ్యుడైన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్‌లో బ్రెవిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 6 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్ 180 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు సాధించి చెన్నై గెలిచిన మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు.
‘బ్రెవిస్ అద్భుతమైన బ్యాటర్. అయితే కనీస ధర ఎక్కువ కావడంతో అతడిని ఎవరూ తీసుకోలేదు. సీజన్ మధ్యలో ఏ జట్టయినా తీసుకుంటే అతని కనీస ధరనే చెల్లించాలి. కానీ నేను ఫలానా మొత్తం ఇస్తేనే వస్తానంటూ బ్రెవిస్ ఏజెంట్ల ద్వారా డిమాండ్ చేశాడు. అయినా సరే సీఎస్‌కే తీసుకుంది’ అని అన్నాడు. దీనిపై సీఎస్‌కే తాజాగా స్పందించింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారమే తాము బ్రెవిస్‌ను తీసుకున్నామని చెప్పింది. ‘గాయపడిన ఆటగాడి స్థానంలో ఎవరినైనా తీసుకుంటే ఆ ప్లేయర్‌కు ఇచ్చే మొత్తమే కొత్త ఆటగాడికి ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. మేం దీనిని ఎక్కడా ఉల్లంఘించలేదు’ అని సీఎస్‌కే పేర్కొంది. వచ్చే సీజన్ కోసం చెన్నైను వీడేందుకు అశ్విన్ దాదాపుగా సిద్ధమైన తరుణంలో ఇది చర్చనీయాంశమైంది.