
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సూర్యకుమార్ తన ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని సూర్య అభిమానులతో పంచుకున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్, ముంబై టీ20 లీగ్ తర్వాత సూర్యకుమార్ తన స్పోర్ట్స్ హెర్నియా గాయానికి జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన ఈ ముంబైకర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు సూర్యకుమార్ దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ టీమిండియా బంగ్లా టూర్ వాయిదా పడడంతో ఈ నెల ఆరంభంలో సూర్యకుమార్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) చేరాడు.
ఈ నెల ఆరంభం నుంచి అక్కడే ఉన్న సూర్య తన ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాడు. "కుడివైపు పొత్తికడుపు దిగువన స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో సూర్య భాయ్ పేర్కొన్నాడు.
కాగా ఆసియాకప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఇక ఈ ఖండంతార టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది.
ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ