
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు. సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హిట్‌మ్యాన్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సత్కరించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
తల్లిదండ్రుల చేతుల మీదుగా
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్‌ను నెలకొల్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా- గురునాథ్ శర్మతో కలిసి ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రోహిత్ భార్య రితికా సజ్దేతో పాటు తమ్ముడు విశాల్ శర్మ, అతడి భార్య దీపాళీ షిండే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు.
నూటికి నూరు శాతం అర్హుడివి
కుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హిట్‌మ్యాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపించాడు. ఇంతటి గౌరవానికి నువ్వు నూటికి నూరు శాతం అర్హుడివని కొనియాడాడు.
‘‘శుభాకాంక్షలు.. ఈ గౌరవానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్ ఆవిష్కరణ.. ఇలాంటి రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రోహిత్ శర్మ స్టాండ్‌లోకి నువ్వు మరిన్ని సిక్స్‌లు కొట్టాలని ఆశిస్తున్నా.
నాకెప్పుడైనా ముంబై స్టేడియంలో టికెట్లు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు బాగా తెలిసింది. నీ పేరిట స్టాండ్ ఉంది కదా.. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్ వీడియో సందేశం ద్వారా రోహిత్‌ను అభినందిస్తూనే ఇలా చమత్కరించాడు.
వరల్డ్‌కప్ గెలిచారు
కాగా రోహిత్ శర్మ- ద్రవిడ్‌ల జోడీ టీమిండియాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించడంతో వీరిద్దరిపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి.
ఈ క్రమంలో అనూహ్య రీతిలో రోహిత్ కెప్టెన్సీలో జట్టును తిరిగి పుంజుకునేలా చేశాడు ద్రవిడ్. అందుకు ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వన్డే వరల్డ్‌కప్-2023లో రన్నరప్‌గానూ నిలిచింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గౌతం గంభీర్ ఆ బాధ్యతలు స్వీకరించాడు.
రోహిత్- గంభీర్ కాంబోలో ఇటీవలే భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచింది. కాగా గతేడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: Suresh Raina: కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు
Rahul Dravid's message to RO got us like... 🥹💙
P.S. The humour at the start & end 😂👌#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 | @rajasthanroyals pic.twitter.com/sdnasfUIKi— Mumbai Indians (@mipaltan) May 17, 2025