
ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు ఆసీస్‌కు కంటితుడుపుగా మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది (తొలి రెండు వన్డేలు గెలిచి).
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఆసీస్ బౌలర్లు తహ్లియా మెక్‌గ్రాత్ (8-0-40-3), అనిక లియారాయ్డ్ (3-0-16-2), ఎల్లా హేవర్డ్ (10-0-40-2), సియన్నా జింజర్ (8.4-0-50-2), లూసీ హ్యామిల్టన్ (10-2-34-1) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (52), యస్తికా భాటియా (42) పోరాటపటిమ కనబర్చి భారత్‌కు ఈ మాత్రం స్కోరైన అందించారు.
వీరు మినహా టీమిండియాలో ఎవరూ రాణించలేదు. నందిని కశ్యప్ (28), రఘవి బిస్త్ (18), తనుశ్రీ సర్కార్ (17), కెప్టెన్ రాధా యాదవ్ (18), తనుజా కన్వర్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. తేజల్ హసబ్నిస్ (1), మిన్నూ మణి (5), సైమా ఠాకోర్ (0), షబ్నమ్ షకీల్ (7 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అలిస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (84 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి శతకంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మరో ఓపెనర్ తహ్లియా విల్సన్ (59), రేచల్ ట్రెనామన్ (21 నాటౌట్) సహకరించారు.
ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో గెలుచుకుంది. టీ20ల్లో ఎదురైన పరాభవానికి భారత్ వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.