
కేఎస్‌సీఏ మహారాజా టీ20 టోర్నీలో కేకేఆర్ ఆటగాడు లవ్‌నిత్ సిసోడియా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో గుల్బర్గా మిస్టిక్స్‌కు ఆడుతున్న అతు.. నిన్న (ఆగస్ట్ 16) శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర అర్ద శతకం బాదాడు. ఫలితంగా అతని జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్.. 15.5 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. దీంతో లయన్స్ ఇన్నింగ్స్‌ను ఆక్కడే ఆపేసి, వీజేడి పద్దతి ప్రకారం గుల్బర్గా లక్ష్యాన్ని 9 ఓవర్లలో 93 పరుగులకు కుదించారు.
LUVNITH SISODIA MAGIC IN MAHARAJA TROPHY...!!!
- Chasing 92 runs from 9 overs, Luvnith 58*(24) & Nikin Jose 34*(15) madness in the chase for Gulbarga Mystics. 🤯👌pic.twitter.com/qRKcJ0rz5O— Johns. (@CricCrazyJohns) August 16, 2025
వర్షం తగ్గాక ఛేదన మొదలుపెట్టిన గుల్బర్గా కళ్లు మూసి తెరిచేలోగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సిసోడియా మెరుపు ఇన్నింగ్స్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు) ఆడి తన జట్టును గెలిపించాడు. అతనికి మరో ఓపెనర్ నికిన్ జోస్ (15 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.
వీరిద్దరి ధాటికి గుల్బర్గా 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సిసోడియా, జోస్ జోడీ లయన్స్ బౌలర్ విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌ను చీల్చి చెండింది. అతను వేసిన 2 ఓవర్లలోనే ఏకంగా 40 పరుగులు పిండుకుంది.
అంతకుముందు ధృవ్ ప్రభాకర్ (44) రాణించడంతో లయన్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తుషార్ సింగ్ (22), నిహాల్ ఉల్లాల్ (17), అనిరుద్దా జోషి (15 నాటౌట్), హార్దిక్ రాజ్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుల్బర్గా బౌలర్లలో శశి కుమార్ 2, విజయ్ కుమార్ వైశాక్, మోనిశ్ రెడ్డి తలో వికెట్ తీశారు.
కేకేఆర్ యాజమాన్యానికి సవాల్
కర్ణాటకకు 25 ఏళ్ల లవ్‌నిత్ సిసోడియాను (లెఫ్ట్ హ్యాండర్) ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్‌లో సిసోడియాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. సిసోడియా మెరుపు బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు.
ఈ సీజన్ మహారాజా ట్రోఫీలో సిసోడియా ప్రదర్శనలను కేకేఆర్ యాజమాన్యం పరిశీలిస్తూ ఉంటుంది. ఈ ప్రదర్శనలతో సిసోడియా కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసురుతున్నాడు. సిసోడియా ఇదే ప్రదర్శనలను కొనసాగిస్తే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు.