
భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.
బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్
ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచి
రంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్‌కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.
ఆశ్చర్యపోయా
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్‌లో కామెంట్రీ చేస్తున్నా.
నాలుగో ఓవర్లో లైవ్‌లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్‌ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.
అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మను
ఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్‌డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా!